Thursday, 5 October 2017

సెల్‌ఫోన్‌ పేలి యువకుడి మృతి...!!!

టి.నగర్‌ : వర్షం పడుతున్న సమయంలో సెల్‌ఫోన్‌ను చార్జింగ్‌లో పెట్టి వాట్స్‌పలో చాటింగ్‌ చేస్తున్న ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానిక రెడ్‌హిల్స్‌ ప్రాంతంలో బుధవారం వేకువజామున ఈ సంఘటన జరిగింది. రెడ్‌హిల్స్‌ నాగాతమ్మన్‌ నగర్‌కు చెందిన రంజిత్‌ (21) తిరుప్పాచ్చూర్‌లోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలో బీఈ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో జోరుగా వర్షం కురుస్తుండగా రంజిత్‌ తన సెల్‌ఫోన్‌కు చార్జర్‌ను కనెక్ట్‌ చేసి వాట్సప్‌లో చాటింగ్‌ చేయసాగాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో పిడుగుపడింది. వెంటనే సెల్‌ఫోన్‌ నుంచి మంటలు చెలరేగాయి.
అత్యధిక ఓల్టేజీతో అతడి దేహమంతా విద్యుత్‌ ప్రసారం కావటంతో రంజిత్‌ గావుకేకలు పెట్టి నేలపై కుప్పకూలిపడ్డాడు. ఆ అరుపులు విన్న రంజిత్‌ తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్న కుమారుడిని హుటాహుటిన రెడ్‌హిల్స్‌ ఎంఏ నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే అతడు మరణించినట్లు ప్రకటించారు. చోళవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

This Is The Oldest Page


EmoticonEmoticon